
Monday, May 5, 2008
చిరంజీవి పార్టీ పేరు"తెలుగు వెలుగు"
మెగాస్టార్ చిరంజీవి తన పార్టీ పేరును ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. "తెలుగు వెలుగు" అని పార్టీకి నామకరణం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లోగోను కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి చిరంజీవి తాను పెట్టే పార్టీ గురించి మే 9వ తేదీననే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అది ఆయనకు కలిసి వచ్చే తేదీ. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా మరో నెల రోజుల పాటు దాన్ని వాయిదా వేసినట్లు పెద్దగానే ప్రచారమవుతోంది. చిరు పార్టీకి చెందిన బ్యానర్లు, వినైల్ హోల్డింగ్స్, పోస్టర్లు తమిళనాడు లోని కోయంబత్తూరులో అచ్చవుతున్నట్లు తెలుస్తోంది.తెలుగుపై మక్కువతో తెలుగు అనే పద్మ్ తప్పకుండా తమ పార్టీ పేరులో ఉండాలని నిర్ణయించుకున్న చిరంజీవి తమ పార్టీకి "తెలుగు వెలుగు" గా నామకరణం చేయడం పట్ల ఆసక్తి చూపారు. గతంలో తెలుగుపై ఉన్న మక్కువతోనే ఎన్టీఆర్ తన పార్టీకి "తెలుగుదేశం" అనే పేరుపెట్టి తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారని, అలాగే ఈ పేరులో ఎక్కడా ప్రత్యేక రాష్ట్రం చాయలు కనిపించవని, దాంతో తమ పార్టీకి "తెలుగు వెలుగు" ఖరారు చేసినట్లు సమాచారం. లోగోను దాదాపు సిద్ధం చేసినప్పటికీ, పార్టీ జెండాలో, అధికారిక చిహ్నంలో తను కాలుతూ వెలుగులను పంచే కాగడా, లాంతరు, కొవ్వొత్తి వంటి గుర్తులను తప్పకుండా వినియోగిస్తే బావుంటుందనే సూచనను ఆయన చేసినట్లు తెలిసింది. ఏదేమైనా చిరంజీవి పార్టీ అతి త్వరలోనే ఆవిష్కరింపబడుతుందనే సమాచారం అందుతోంది.
Saturday, May 3, 2008
"షీలా"ది ఐరన్ లెగ్గా?
అల్లు అర్జున్ , షీలా జంటగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పరుగు' సినిమా అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ తుస్సుమంది. దాంతో ఆ ఫెయిల్యూర్ క్రెడిట్ మొత్తం హీరోయిన్ పాత్రధారి షీలా పైకి నెట్టేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఐరన్ లెగ్ అని అందుకే ఇలా జరిగింది అంటున్నారు. కాని మరో వర్గం మాత్రం ఫెయిల్యూర్ భాద్యత మొత్తం రెండో గండం దాటలేని భాస్కర్ దే అంటున్నారు. 'సీతాకోకచిలుక' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తమిళ ముద్దు గుమ్మ షీలా. ఆ సినిమా తరవాత ఆమె దిల్ రాజు సమర్పించిన 'హలో ప్రేమిస్తారా' లో పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ సరసన నటించింది. ఈ రెండు ఫ్లాపు అయ్యాయి. అయినా దర్శకుడు భాస్కర్ ఆమెను యేరికోరి ఎంపిక చేసుకున్నాడు.నిజానికి 'దేశముదురు' తర్వాత విపరీతమైన స్టార్ డమ్ సంపాదించిన అల్లు అర్జున్ ప్రక్కన ఏ త్రిషానో , ఇలియానానో పెట్టుకోవచ్చు. కానీ సినిమాలో ఉండే అమాయకపు పల్లె పడుచు పాత్రకు షీలానే సూటవుతుందని భాస్కర్ భావించాడట. దాంతో మంచి ఆఫర్ వచ్చినందుకు ఆమె కూడా చాలా సంతోషపడింది. కాని సీను రివర్స్ అయింది. దాంతో ఆమె మెదటి నుంచి ఐరన్ లెగ్ అందుకే ఇలా జరిగింది అని ఆమె పైకి పరాజయాన్ని త్రోసే ప్రయత్నం చేస్తున్నారు సెంటిమెంట్లును విపరీతంగా నమ్మే సినిమా వారు.కాని మరో వర్గం మాత్రం తెలుగు దర్శకులకు తప్పని రెండో సినిమా గండం భాస్కర్ దాటలేక పోయాడని కామెంట్లు చేస్తున్నారు. మొదటి సినిమా హిట్టు కిక్కు అతన్ని హేంగోవర్ లో ఉంచిందని అందుకే కథని తనిష్టమొచ్చినట్లు నడిపాడని అంటున్నారు. 'బొమ్మరిల్లు' లో తండ్రి కొడుకుల మద్య చోటు చేసుకునే కమ్యూనికెషన్ గ్యాప్ అనే సున్నితమైన అంశాన్ని చక్కని స్కీన్ ప్లే తో నడిపిన భాస్కర్ ఈ సినిమాలో అదే మిస్సయ్యాడని అంటున్నారు. అయినా ఈ సినిమా హిట్టయినా హోల్ అండ్ సోల్ గా అతనికే పేరొచ్చేలా కథని నడిపాడని, ఆఖరికి అల్లు అర్జన్ లో ఉన్న ఎనర్జీని, మాస్ ఇమేజ్ ని కూడా ప్రక్కన పెట్టాడని వారు వాదిస్తున్నారు. కాబట్టి షీలా కన్నా భాస్కర్ దే ఈ సినిమా పరాజయ భాద్యత అని డిసైడ్ చేస్తున్నారు.
Friday, May 2, 2008
శ్రీనువైట్ల దర్శకత్వంలో నాగార్జున "కింగ్"
తెలుగు సినిమా "మన్మథుడు" నాగార్జున, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. నాగార్జున మితృడు డి. శివప్రసాద్‌రెడ్డి నిర్మాతగా "కామాక్షి కళా మూవీస్" పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా ప్రారంభమైంది. దేవుని చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ కొట్టగా, అక్కినేని అమల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున కుటుంబసభ్యులతో పాటు
కెమెరామెన్ ప్రసాద్ మారెళ్ల, రచయిత గోపీ తదితరులు పాల్గొన్నారు. మే 21 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో త్రిష కథానాయకగా నటించనుండగా ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. "డాన్" తర్వాత హీరో నాగార్జున నటిస్తున్న ఈ చిత్రానికి "కింగ్" అనే పేరును ఖరారు చేశారు.
Subscribe to:
Posts (Atom)


