యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలను పంచెలూడేదాక పరిగెత్తించాలని, రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా తరిమి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ రాజ్యం-దొంగల రాజ్యం, ప్రతి కాంగ్రెస్ నాయకుడికీ దుర్మార్గపు క్రిమినల్ చరిత్ర ఉంది.. దోచుకుతింటున్నారు.. ఎంతకాలం ఈ దోపిడీని చూస్తూ ఉంటాం.. అంటూ వారిపై తీవ్ర పద జాలంతో విరుచుకుపడ్డారు.'యువజనులతో ఉత్తమ సమాజ నిర్మాణం' పేరిట మంగళవారం ధర్నాచౌక్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ హావభావాల్ని అభినయిస్తూ ఆవేశపూరితంగా మాట్లాడారు. భీమ్‌రావుబాడలో ఇళ్ల కూల్చివేత ను నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
గొంతెత్తలేని వారిపై దాడి చేయడం.. వాళ్ల ఆస్తులను దోచుకోవడమే కాంగ్రెస్ వారిపని.. బీదలను రోడ్డున పడేసి మానవహారం చేస్తారు.. రైతుబంధు ప్రభుత్వమట.. సెజ్‌లు పెట్టి తిండికి కూడా లేకుండా చేసి రైతులను రోడ్డున పడేశారు.. వీరి దోపిడీని ఎన్నాళ్లు చూస్తాం.. మనం తిరగబడితే పంచెలూడిపోయేలా రాష్ట్రం నుంచి దేశం నుంచే పారిపోతారు..' అంటూ ఆయన ఆవేశంగా ప్రసంగించారు.
'భీమ్‌రావుబాడలో ఇళ్ళు కూల్చివేసిన మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మానవహారంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ నవ్వుతూ పాల్గొనడం సిగ్గుచేటు. దేశసమైక్యత కోసం గానీ, ఉగ్రవాద నిర్మూలన కోసం గానీ ఈ మానవహారం నిర్వహించలేదు.
జైపాల్‌రెడ్డి సామాన్యులకు అర్థంకాని ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ ఢిల్లీలో వైస్‌ను తిడుతూనే అవినీతిలో చేతులు కలుపుతారు. వక్ఫ్‌బోర్డు భూములను అమ్మి ముస్లింలను రోడ్డు పాలు చేసిన ఘనత షబ్బీర్ అలీకే దక్కుతుంది. ఈయన బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి... దేశంలో బాంబుపేలుళ్లు జరిపిన ఐఎస్ఐ తీవ్రవాది ఇంటికి వెళ్ళి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇక టి.సుబ్బిరామిరెడ్డి భక్తుడు. నిత్యం వైజాగ్ బీచ్‌లో ఓం నమః శివాయ సర్వేజనా సుఖినోభవంతు అంటూ బాహాటంగా ప్రార్థనలు చేస్తూనే... సర్వేజనా దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉండటం సిగ్గుచేటు. ఈ విధంగా చెప్పుకుంటే పోతే ప్రతి కాంగ్రెస్ నాయకుడికీ దేశద్రోహ చరిత్ర ఉంది' అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ వద్ద వేలకోట్ల రూపాయలు, వేల ఎకరాల స్థలం ఉన్నప్పటికీ... అనేక సంవత్సరాలుగా పేదలు నివసించే భీంరావుబాడను పార్టీ కార్యాలయం కోసం కబ్జా చేశారని విమర్శించారు. 'వైఎస్ ఎన్నికల ముందు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సెజ్‌ల పేరుతో రైతుల నుంచి భూములు లాక్కొని వారికి అన్యాయం చేస్తున్నారు.
తెలంగాణ ఇస్తామని చెప్పి... నాలుగున్నరేళ్లుగా అదిగో, ఇదిగో అంటూ తెలంగాణకు వెన్నుపోటు పొడిచారు. శాంతి చర్చల పేరిట పిలిచి 80 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశారు' అని విమర్శించారు.ఈ ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రరాపా కార్యకర్తలు వాడవాడలా వివరించాలి. కాంగ్రెస్‌ను గద్దె దించేంతరకూ పనిచేయాలి. సుస్థిర పాలనకోసం చిరంజీవిని గెలిపించాలి అంటూ ప్రజలను కోరారు.
Wednesday, December 31, 2008
Tuesday, December 30, 2008
Tuesday, December 23, 2008
Monday, December 15, 2008
Friday, December 12, 2008
Subscribe to:
Posts (Atom)