ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వరంగల్ కోర్టు బుధవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది। దర్యాప్తు చేసి నివేదికను వచ్చేనెల 29వ తేదీలోపు కోర్టుకు సమర్పించాలని నాలుగో అదనపు మునిసిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్‌ఛార్జి మెజిస్ట్రేట్ అయిన పీసీఆర్(ప్రొటెక్షన్ ఫర్ సివిల్ రైట్స్) మెజిస్ట్రేట్ భవానీచంద్ర కాజీపేట పోలీసులను ఆదేశించారు। కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు స్పందించి చిరంజీవిపై కేసు నమోదుకు ఆదేశించింది. కుమారస్వామి రాష్ట్ర రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు.
వరంగల్ జిల్లాలో రోడ్డు షోలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఈనెల 3న ఉదయం కుమారస్వామి ఆధ్వర్యంలో ఫాతిమానగర్ వద్ద ప్లకార్డ్స్ పట్టుకుని కార్యకర్తలు చుట్టుముట్టారు. ఎస్సీల వర్గీకరణపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని చిరంజీవిని కోరారు. ఈ సందర్భంగా తనను తనతో పాటు వచ్చిన అందరినీ చిరంజీవి అవమానపరిచారని కుమారస్వామి కోర్టులో వేసిన పిటీషన్‌లో ఆరోపించారు. 'ఓహో దళితులా! మాదిగలా! ఐతే మీతో మాట్లాడవలసిన అవసరం నాకులేదు' అంటూ చిరంజీవి అవమానించారని ఆయన ఆరోపించారు. చిరంజీవి వాహనం హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన వడునూరి రాజేందర్‌ను ఢీకొట్టగా అతనికి గాయాలయ్యాయని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు బాధితున్ని చికిత్స నిమిత్తం మహాత్మాగాంధీ ఆసుపత్రికి పంపించారని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment