Wednesday, February 27, 2008
మార్చి 6న విడుదలవనున్న శ్రీహరి "భద్రాద్రి"
నంది ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీహరి, రాజా, గజాలా, నిఖిత జంటగా నటిస్తోన్న చిత్రం "భద్రాద్రి". మల్లికార్జున్ దర్శకత్వంలో యం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. సెన్సార్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ పెట్టి నైజాంలో 65 థియేటర్లలో విడుదల చేస్తున్నానని, మొత్తం 150 ప్రింట్లతో ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. నేటి వైద్య వ్యవస్థ ఎంత దిగజారిందో కళ్లకు కట్టినట్లు తెలియచెప్పే చిత్రమే "భద్రాద్రి" అని నటుడు రాజా అంటున్నారు. చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంలో నటించాననే సంతృప్తి మిగిలిందని పేర్కొన్నారు. ఇందులో బ్రహ్మానందం పాత్ర హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ఫైటర్స్ రామ్‌లక్ష్మణ్‌లు తనను కొత్త కోణంలో ఆవిష్కరించారన్నారు. శ్రీహరి మాట్లాడుతూ, నా చిత్రాల సేలబిలటీకంటే మించి శివకుమార్ ఖర్చుపెట్టారు. మంచి స్నేహితుని చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఇటువంటి వ్యక్తులు నిర్మాతగా ఉంటే మరింత ఎత్తుకు ఎదుగుతాను. నాపై పెద్దగా బిజినెస్ అవ్వదు అని చాలా మంది నిర్మాతలు భయపెట్టినా తను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. బయ్యర్లు అనుకున్నవిధంగా డబ్బులు ఇవ్వకపోయినా తాను డిస్ట్రిబ్యూటర్‌గా మారి చిత్రాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మరోమారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఈ చిత్రానికి బాబీ రాసిన మాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందనే నమ్మకముంది. ప్రతి వారినీ ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మణిశర్మ సమకూర్చిన బాణీలకు ఆదరణ అనుకున్నవిధంగానే ఉంది. ప్లాటినం వేడుకను జరుపుకున్నామని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment