Monday, September 29, 2008

చిరంజీవి ప్రజాయాత్ర

చిరంజీవి ప్రజాయాత్రకు సమయం ఆసనమవుతోంది. ప్రజాయాత్ర తేదీలు ఇంకా ఖరారు కాలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పినా ఈ అక్టోబర్ రెండు నుంచి ఆయన అనధికారికంగా అధికార యాత్రనే చేయనున్నారు.
త్వరలో ఈ యాత్ర తేదీలను ఖరారు చేస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాను మొదట కోస్తాలో మూడు జిల్లాలు, ఆ తర్వాత రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున "వూరూరా ప్రజారాజ్యం-వూరూరా పండగ" అనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు జరపనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. అక్టోబరు 2న రాష్ట్రంలోని అన్నీ గ్రామాలు, పట్టణాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు ఆవిష్కరించాలని కోరారు. అదే రోజు కోటిమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని కేవలం పార్టీ కార్యక్రమంగా భావించకుండా ఒక సామాజిక కార్యక్రమంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

అదే రోజునుంచి పార్టీ సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు. మొదటి సభ్యత్వం వికలాంగుడైన బాలకృష్ణకు ఇచ్చి, తరువాత తాను తీసుకుంటానని ఆయన తెలిపారు. మొదట జిల్లా కార్యాలయాలు ప్రారంభమవుతాయని అనంతరం మండలస్థాయి, గ్రామకమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చిరు తెలిపారు. ఆదీవాసీలకు ఇబ్బంది కలిగితే బాక్సైట్‌ వెలికితీతను ఆపాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పోలేపల్లిలో ఎకరం రూ.18 వేలకు తీసుకొని అదే భూమిని లక్షలకు అమ్మడాన్ని ఆయన ప్రశ్నించారు.

అమెరికాతో చేసుకున్న 123 ఒప్పందంపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందువల్ల స్పష్టత అవసరమని ఆయన అన్నారు.

No comments: