ఈ చిత్ర కథ ఇదమిద్దంగా ఇదేనని తెలియకపోయినా, తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో విభిన్న కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. అక్కడక్కడా వినిపడే దాన్ని బట్టి చిత్ర కథ 12వ శతాబ్దంలో మొదలై, నేటి కాలంలో నడుస్తుంది. 12వ శతాబ్దంలో రాజు రెండవ కుళోత్తుంగ చోళుని అరాచకాలకు అంతు వుండదు. విష్ణు భక్తుడైన రంగరాజ నంబి ఆ రాజుకు ఎదురు తిరుగుతాడు.దాంతో రాజద్రోహం కింద నంబికి మరణ దండన విధిస్తాడు చోళుడు. తనను ఉరి తీసే సమయంలోనూ నంబి విష్ణు విగ్రహాన్ని వదలడు. ఆ విగ్రహంతో పాటు నంబి మృతదేహాన్ని సముద్రంలో పారేయిస్తాడు చోళుడు. ఆ తర్వాత కథ నేటి కాలంలోకి మారుతుంది. ఈ ఆధునిక కాలంలో కమలహాసన్ 9 పాత్రల్లో కనిపిస్తాడు. ఆ పాత్రలన్నింటికీ కథతో సంబంధం వుంటుంది. ఈ కాలంలో జరిగే కథలో కమల్ హాసన్ రంగరాజ నంబి పాత్రతో పాటు గోవింద రామస్వామి, జార్జి బుష్, అవతార్ సింగ్, క్రిస్టియన్ ఫ్లెచర్, షింఘేన్ నరహసి, కృష్ణవేణి, విన్సెంట్ పూవరాగన్, కలీఫుల్లా ఖాన్, బలరాంనాయుడు పాత్రల్లో కనిపిస్తాడు. రెండవ కుళోత్తుంగ చోళునిగా నెపోలియన్ నటించగా, ఇతర పాత్రల్ని నగేష్, పి. వాసు, సంతాన భారతి, రేఖ, రఘురాం, కె.ఆర్. విజయ చేశారు. కమల్ సరసన నాయికగా అసిన్ ద్విపాత్రలు పోషించగా, బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్, నిన్నటి తరం అందాల తార జయప్రద కూడా కమల్ సరసన కనిపించనున్నారు. కాగా ఈ చిత్ర కథకోసం మెయిన్ పాయింటును బ్రియాన్ వీజ్ అనే ఆంగ్ల రచయిత వ్రాసిన "మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్" ,"సేమ్ సోల్ మెనీ బాడీస్" అనే పుస్తకాల ఆధారంగా తయారు చేసినట్లు సమాచారం. హిందూ కర్మ సిద్దాంతాన్ని బలపరిచే ఈ పుస్తకాలలోని విషయం ప్రకారం మనిషి రకరకాల జన్మల్లో జన్మిస్తూ,కొత్త కొత్త విషయాలు తెల్సుకుంటూ చివరకు పరమాత్మలో లీనమవుతాడు. ఆయన రెగ్రెషన్ థెరిపీ ఆధారంగా వ్రాసిన అంశాల ప్రకారమే కథనం నడుస్తుందంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.
(Story of Kamal’s “Dasavataram”)
1 comment:
Really fentastic-
Post a Comment