Tuesday, June 17, 2008

చిరంజీవి తయారు చేయించుకుంటున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం

చిరంజీవి రాజకీయ ప్రవేశానికి సంబంధించిన మరో అంకం తుది దశకు చేరుకుంది. చిరంజీవి రాజకీయ ప్రవేశం అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఆయన రాజకీయ ప్రవేశం ఖరారైంది. దాంతో చిరంజీవి అనుయాయులు చిరంజీవికోసం రక్షణ అంశాలపై ఇప్పుడు దృష్టి సారించారు. గత కొంత కాలంగా చిరంజీవి రక్షణ కోసం ఓ బుల్లెట్ ప్రూఫ్ వాహనం రూపొందుతోంది. చిరంజీవి ప్రచార రథం గా కూడా వినియోగించే ఈ వాహనం హైదరాబాద్ లోని జీడి మెట్లలో ఉన్న రియల్ కార్స్ లో రూపు దిద్దుకుంటోంది. రాష్ట్రంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తయారు చేయడంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థలో ఈ భారీ రక్షణ వాహనం రూపుదిద్దుకుంటోంది. ఒక ఐషర్ వ్యాన్ ను తీసుకుని దానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రాధమిక స్థాయిలో ఈ వాహనాన్ని పలుమార్లు పరీక్షించడం కూడా జరిగిందని సమాచారం.
చిరంజీవి తన రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడంకోసం, ప్రచార కార్యక్రమాలలో ఉపయోగించడం కోసం ఈ వాహనాన్ని ప్రత్యేక సదుపాయాలతో తయారు చేశారు. ఇందులో చిరంజీవి తన ప్రయాన సమయంలో పడుకోడానికి, స్నానం చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయించుకుంటున్నారు. చిరంజీవి మరో జంబో వాహనాన్ని అహ్మదాబాద్ లో తయారు చేయించుకుంటున్నారన్న వార్త కూడా నిజమే. అయితే ఆ ఆ జంబో వాహనంలో తను కాకుండా అల్లు అరవింద్, నాగబాబు, పవన్ కళ్యాణ్ సహా ఇతర ముఖ్య నాయకులకు కేటాయించినట్లు సమాచారం. తను మాత్రం ఎన్టీఆర్ లా సింపుల్ గా ఉండటం కోసం, అన్ని రకాల చిన్న పెద్ద సమావేశాలకు ఉపయోగించడం కోసం పెద్ద వాహనమైతే ప్రతిబందకంగా మారుతుందని, అలాగే పెద్ద వాహనాన్ని ఎవరైనా సులువుగా గుర్తించే వీలుండటంతో చిరంజీవి తనకిఎసం ఈ చిన్న వాహనాన్ని రూపొందించుకుంటున్నట్లు సమాచారం. జీడిమెట్లలో తయారవుతున్న చిరంజీవి "ప్రచారరథం"పై ఇప్పటికే నిఘా పోలీసులు సహజంగా దృష్టి సారించినట్లు బోగట్టా. చిరంజీవి భద్రతకు ఏ కోణం నుంచి చూసినా ప్రమాదం లేదని, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరం లేదని నిఘా పోలీసుల అభిప్రాయంగా తెలుస్తోంది.అయితే ప్రైవేటు వ్యక్తులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేయించుకోవచ్చా? ఇది కొత్త విషయం కాబట్టి దీనిపై ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలను రూపొందించుకోలేదు. ఈనాడు గ్రూపు సంస్ధల అదినేత రామోజీరావుకు, ఎమ్మెల్సీ కాసాని గ్జానేశ్వర్ లతోబాటు మరికొందరు ప్రముఖులు అనధికారికంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుతున్నట్లు సమాచారం. కాబట్టి చిరంజీవి అటువంటి వాహనం తయారు చేయించుకోవడం చట్టవిరుద్ధం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

No comments: