Thursday, August 28, 2008

చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ

ఒకరు మెగాస్టార్ గా వెలిగి తెలుగుతెరపై వెలుగువెలిగిన హీరో.. మరొకరు నటసార్వబౌముడిగా విశ్వనట చక్రవర్తి అయిన దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఆవిర్భవనేత ఎన్ టీఆర్ కుమారుడు, నటుడు... ఇరువురు తెలుగు సినీ కళామ తల్లికి ముద్దుబిడ్డలే. ఇద్దరూ ఉద్దండులే.. కలిసి మెలిసి తిరిగిన ఈ కళాకారులు త్వరలో కాలు దువ్వేందుకు సన్నద్దమవుతున్నారు. చిరంజీవి ఏకంగా ప్రజారాజ్యాన్ని స్థాపించగా, బాలకృష్ణ తన తండ్రి పెట్టిన తెలుగుదేశానికి కొత్త ఊపిరి పోసేందుకు సిద్దమవుతున్నారు. సినిమాల జయాపజాయాలతో పరిశ్రమ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నా మంచి ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో రెండు భిన్న దృవాలు రాజకీయలలో కాలు దువ్వేందుకు సిద్దమవుతుండటం సినీ వర్గాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. వీరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఎదుగుతుందో తెలియదు కాని ఇద్దరు మహా కథానాయకులు రాజకీయ రంగ ప్రవేశం చేయటం వారి అభిమాన వర్గాలను ఇరుకున పెడుతోంది.
తిరుపతిలో జరిగిన మహా సభ ద్వారా చిరంజీవి రాజకీయారంగేట్రానికి తెరతీయగా, గుంటూరులో జరగనున్న టిడిపి యువ ఘర్జన సభ ద్వారా బాలకృష్ణను ప్రజారాజ్యం పార్టీకి ధీటుగా తీసుకు రావాలని కొందరు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి చిరంజీవి ద్వారా టిడిపి ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్న నేతలు నష్టాన్ని పూడ్చుకోవటంతో పాటు పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టీఆర్ కుటుంభం మొత్తం తమతో ఉందని నిరూపించుకొని తద్వారా వచ్చే ఎన్నికల్లో లాభ పడాలని యోచిస్తున్నారు.
సొంత పార్టీ ఏర్పాటు ద్వారా రానున్న ఎన్నికల్లో విజయదుంధుభి మోగించి మరో మారు రాష్ట్రంలో కొత్త రాజకీయాలను వెలుగు చూపించాలని చిరంజీవి బావిస్తున్నారు. ఇందులో భాగంగానే తనకున్న ప్రజా భలం ఏపాటిదో పరీక్షించేందుకు తిరుపతి సభను ఉపయోగించుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఎన్ టీఆర్ దారిలోనే తమ పార్టీ మనుగడను కొనసాగించేలా అట్టడుగు వర్గాల బాట పట్టినట్లు చిరు రాజకీయారంగేట్ర సభ నిరూపించినట్లు విశ్లేషకులు సైతం అంటున్నారు. తద్వారా చిరంజీవి ప్రజల నాడిని పట్టుకునేందుకు అధిక ప్రాదాన్యతిస్తూ రాష్ట్ర పర్యటన చేయాలని యోచిస్తున్నారు. అంతే కాకుండా తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు వివిద పార్టీల్లోని సీనియర్లను తమ ప్రజారాజ్యంలో చేరాలని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే వేర్వేరు పార్టీలకు చేందిన పలువురు సీనియర్లతో రహస్య సమావేశాలు నిర్వహించిన చిరంజీవి సమయానుకూలంగా వారిని పార్టిలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఎన్ టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో ఆయన కుటుంభీకుల పాత్ర తక్కువేనని చెప్పొచ్చు. బాలకృష్ణ సోదరుడైన హరికృష్ణ ఒక్కరే తెలుగుదేశంలో కీలక భూమికను పోషిస్తుండగా వీరి సోదరి పురందరేశ్వరి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడ ఓమారు ఎన్నికల ప్రచారం చేసినా వేదికలెక్కిన సందర్బం లేదు. ఈ నేపధ్యంలో చిరంజీవి పార్టీ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తెప్పించాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకు ఎన్ టీఆర్ కుంటుంభాన్ని తెరపైకి తీసుకు రావటమే సరైన నిర్ణయంగా తెలుగుదేశం భావిస్తోంది. మరో వైపు కుటుంభాలపరంగా మనస్పర్థలున్నా అన్నింటిని మరచి నందమూరి వంశస్తులనందరినీ ఒకే తాటిపై తెచ్చె ప్రయత్నాలు కొంతకాలంగా జరిగాయి. ఏదయితేనేం రాజకీయంగా తమ తండ్రి స్థాపించిన తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే పట్టుదల నందమూరి వంశంలో వచ్చింది. ఇందులో భాగంగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీఆర్, కల్యాణ్ రాంతో పాటు నందమూరి కుటుంభాన్ని గుంటూరు వేధికపైకి తీసుకురావాలని తెలుగుదేశాన్ ప్రయత్నిస్తోం.
నందమూరి వంశీయులు గుంటూరు వేధిక ఎక్కితే వచ్చే ఎన్నికల్లో జరిగే రాజకీయ పోరు చిరంజీవి ప్రజారాజ్యం, బాలకృష్ణ తెలుగుదేశం నడుమే దిగ్గజాలు డీ కొట్టినట్లుగా ఉంటుందని విశ్లేషకుల భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలిస్తూనే తమ వైపు నుంచి కూడా సినీ తారలను రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల చిత్రం మహా సంగ్రామాన్నే సృష్టిచే అవకాశాలకు తెరతీస్తోంది. 1983 తర్వాత త్వరలో జరగనున్న ఎన్నికలు మరో మారు ఆంధ్రరాష్ట్ర రాజకీయలకు కేంద్ర భిందువు కానుంది. ఇక తారల పోరా... రాజకీయ హోరా అన్నది రానున్న ఎన్నికల ద్వారా నిర్ణయించుకోవాల్సింది ప్రజలే.

No comments: