Monday, December 10, 2007

కార్పోరేట్ కంపెనీల ఆఫర్లతో తలమునకలౌతున్న శేఖర్ కమ్ముల






'ఆనంద్", "గోదావరి" ల తర్వాత తన దర్శకత్వంలో నిర్మించిన "హ్యాప్పీడేస్" చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములను కార్పోరేట్ కంపెనీలు ఆఫర్లతో ముంచెత్తుతున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ "యుటివి",రిలయెన్స్ లతోబాటు తాజాగా మోజర్ బేర్ సంస్థ కూడా తమ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మించాలని ప్రణాళికలు వేసుకుని తదనుగుణంగా శేఖర్ కమ్ములను సంప్రదిస్తున్నాయి. యు టి వి సంస్థ తాము మహేశ్ బాబుతో నిర్మించదలచిన తమ కాంబినేశన్ లోని మూడవ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తే బావుంటుందని భావించి, శేఖర్ కమ్ములను సంప్రదించడమే కాకుండా, అందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను ప్రకటించింది. ఈ చిత్రం ప్రస్తుతం సిట్టింగ్ ల స్థాయిలోనే వుంది. ఇక రిలయెన్స్ సంస్థకు చెందిన యాడ్ ల్యాబ్స్ కూడా శేఖర్ కమ్ములను సంప్రదించడం జరిగింది. మరోవైపు వీసీడీ, డీవీడీ రంగంలో తిరుగులని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న మోజర్ బేర్ సంస్థ తమ తొలి చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మించాలని భావిస్తూ, అందుకుగాను పెద్దమొత్తమే ఇవ్వడానికి సిద్దమైంది. ఇక తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తన మనవడు హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఆఫర్లు ఒకదానికి మించి మరోటి వస్తున్నా శేఖర్ కమ్ముల మాత్రం ఏచిత్రానికీ ఇంకా ఒప్పుకోకుండా తన తదుపరి చిత్రాన్ని తన స్వీయ నిర్మాణంలో నిర్మించడానికి సమాయత్తమై, దానికి సంబంధించిన స్క్రిప్టు పనులను అతివేగవంతంగా కొనసాగిస్తున్నాడు. చూద్దాం ముందు ముందు మరేం జరుగుతుందో, అలాగే శేఖర్ కమ్ముల ఏ చిత్ర నిర్మాణ సంస్థ వైపు మొగ్గు చూపుతాడో.

No comments: