Monday, December 24, 2007

నటుడు చిరంజీవికి పితృవియోగం


మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు సోమవారం తెల్లవారుజామున హృదయసంబంధిత వ్యాధితో కన్నుమూశారు. క్రమశిక్షణకు మారుపేరైన వెంకట్రావు మృతి చిరజీవి కుటుంబాన్ని తీవ్ర దుఖఃసాగరంలో ముంచెత్తింది. రాష్ట్ర ఎక్సైజ్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేసిన వెంకట్రావు ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా విశ్లేషించి, చక్కని నిర్ణయాలు తీసుకునేవారు. గత రెండుమూడు నెలలుగా అస్వస్థకు లోనైన వెంకట్రావును స్థానికంగా ఉన్న ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. చిరంజీవి తండ్రి కన్నుమూశారని వార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, చిరంజీవి అభిమానులు జూబ్లీ హిల్స్‌లోని చిరంజీవి నివాసానికి చేరుకుని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ చిరు కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా వెంకట్రావుకు భార్య అంజనీదేవీ, కుమారులు చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్, కుమార్తెలు విజయదుర్గ, మాధవిలు ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండలో జన్మించిన వెంకట్రావు అదే జిల్లాలో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా చేసి, నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా పదవీ విరమణ చేశరు. ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనంగా ఉండే వెంకట్రావు మృతి సినీ రంగానికి చెందిన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

No comments: