బ్రిటీషు వారికి నిద్దురలేకుండా చేసిన "వందేమాతరం" నినాదమే పేరుగా చిరంజీవి నటించనున్న 149వ చిత్రం రూపొందనుంది. 1931లో తెలుగు సినిమా ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా "వందేమాతరం" పేరుతో మూడు చిత్రాలు నిర్మాణమయ్యాయి. ప్రస్తుతం ఇదే పేరుతో చిరంజీవి తన చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. చిరంజీవి రాజకీయ నేపద్యం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తన చిత్రానికి "వందేమాతరం" పేరును నిర్ణయించడంతో ఈ చిత్రానికి మరింత ప్రాధాన్యత చేకూరింది.తెలిసిన సమాచారం ప్రకారం వి వి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే గతంలో దర్శకుడు కృష్ణవంశీ చిరంజీవితో తాను "వందేమాతరం" చిత్రాన్ని నిర్మిస్తున్నానై పత్రికలవారికి తెలియజేయడం తెలిసిందే. దాంతో ఈ చిత్రానికి ఈ ఇద్దరు దర్శకులలో ఒకరు దర్శకత్వం వహించవచ్చునని తెలుస్తోంది. అయితే వి వి వినాయక్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా చెన్నైలో సిట్టింగ్ లను కూడా నిర్వహించడం చూస్తుంటే ఇదమిద్దంగా ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో చెప్పడం సందిగ్దంగా మారింది. ప్రస్తుత నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి సన్నివేశాలతో రూపొందనుందన్న ఆసక్తి రాజకీయ పార్టీ నేతలలో నెలకొంది. ఇటీవల తెలంగాణా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఓ విలేకరితో చిరు రాజకీయ ప్రవేశం గురించి వ్యాఖ్యానిస్తూ "ముందు ఆయన రాజకీయ ప్రవేశం సంగతి ఏమోగానీ, దానికి పునాది వేసే ఈ 149వ చిత్రం మటుకు తప్పనిసరిగా రాజకీయాలపై ఎక్కుపెట్టే అస్త్రం" కావచ్చునని అన్నారు. ఏదేమైనా ఈ చిత్రం మార్చి 18న షూటింగ్ ప్రారంభం కావచ్చని ఫిలింనగర్ వాసుల కథనం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment