Thursday, January 10, 2008
మాయావతి తెలుగు సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి
బి.ఎస్.పి మహాసభలో నాయకురాలు మాయావతి సినిమారంగంపై వెల్లడించిన అభిప్రాయాలను చిన్న నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. మంగళవారం నాడు ఫిలిమ్ ఛాంబర్‌లో మండలి అధ్యక్షుడు నట్టికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటయింది. ఈ సందర్భంగా నట్టికుమార్ మాట్లాడుతూ, సినిమావాళ్ల మాయలో పడొద్దు. వాళ్లు ఆటపాటలకే తప్ప, రాజకీయాల్లోకి పనికిరారు అని మాయావతి అనటం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. గతంలో ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎం.జి.ఆర్, జయలలిత, ఎన్.టి.రామారావు, దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, శరత్ కుమార్, విజయ్ కాంత్, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, శత్రుఘ్న సిన్హా, రాజేష్ ఖన్నా ఇలా ఎందరో సినిమా రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేశారు. ఈ విషయాలన్నీ ఆమెకు తెలియవా? అసలు ఏం తెలుసని ఆమె అలా మాట్లాడారు. వెంటనే ఆమె చేసిన వ్యాఖ్యలను రెండురోజుల్లో ఉపసహరించుకుని క్షమాపణ చెప్పాలి. లేదంటే బి.ఎస్.పి కార్యకర్తలముందు నిరసన వ్యక్తం చేస్తాం అన్నారు. " సినిమావాళ్లు బయటకు వస్తే అభిమానంతో ప్రజలు వస్తారు. కానీ ఆమె ఏర్పాటు చేసిన సభకు డబ్బులిస్తేనే జనం వస్తారనీ, ఈ విషయాన్ని ఆమె గ్రహించాల"నీ మండలి ఉపాధ్యక్షుడు సత్యారెడ్డి విమర్శించారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాటలను అన్నదో తెలియదు కానీ, యావత్ సినీ ప్రపంచాన్ని అనటం సముచితం కాదని మండలి కార్యదర్శి ఇ.వి.ఎన్.చారి పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, ఎస్.వి.రావు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment