Wednesday, January 9, 2008

తొలి తెలుగు చిత్రం:భక్త ప్రహ్లాద భక్తప్రహ్లాద

తొలి తెలుగు టాకీ చిత్రం. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 15, 1931న విడుదలైనది. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ను అర్దేషిర్.ఎం.ఇరానీ ఇంపీరియల్ ఫిలిం కంపనీ పతాకంపై నిర్మించాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు నిర్మించాలనిపించి తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న హెచ్.ఎమ్.రెడ్డి తెలుగు, తమిళం తెలిసిన తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద’ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు. ఇందులో మునిపల్లె వెంకట సుబ్బయ్య హిహణ్యాక్షుడిగా, సురభి కమలా భాయి లీలావతిగా,సింధే కృష్ణాజీ రావు ప్రహ్లాదునిగా,చండా మార్కుల వారి శిశ్యుడిగా ఎల్.వి.ప్రసాద్ తదితరులు నటించారు. అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజం వారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో నిర్మించారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.
ఈ చిత్రంలోని
"పరితాప భారంబు భరియింప తరమా..."
పాట ఆరోజుల్లో బహుళ జనాదరన చూరగొంది.ఇక్కడో విషయం మనం చెప్పుకోవాలి. చిత్ర దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి మొదట పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుండేవాడు. సినీ పరిశ్రమపై ఉన్న మక్కువ కారనంగా తన ఉద్యోగానికి రాజీనామాచేసి ఇంపీరీల్ ఫిలిం కంపనీలో లైట్ బాయ్ గా చేరాడు. ఇరానీ దగ్గర సహాయకుడిగా పని చేసిన హెచ్.ఎం.రెడ్డి మొదట "రాజ్ కుమార్" అనే మూకీ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఆ తర్వాత "ఆలం ఆరా" చిత్రానికి పనిచేసింతర్వాత తొలి తెలుగు చిత్రం "భక్త ప్రహ్లాద" ప్రారంభించాడు. అయితే ఇక్కడొక విషయం. హెచ్.ఎం.రెడ్డి తెలుగు కన్నా ముందు తమిళ చిత్రాన్ని ప్రారంభించాడు. ముందు "కాళిదాసు" చిత్రాన్ని తెలుగులో నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించినా, కాళిదాసు కథను తెలుగువారు ఎంతవరకు ఆదరిస్తారో అనే అనుమానంతో దీనిని తమిళ చిత్రంగా నిర్మించారు. అయితే అప్పటికే పాటల చిత్రీకరణ పూర్తవడంతో ఈ తమిళ చిత్రంలో తెలుగు పాటలను అలాగే ఉంచి చిత్రాన్ని విడుదల చేసారు.అప్పటి సమైఖ్యాంధ్రలో తమిళం మాట్లాడేవారికి తెలుగు కూడా రావడం వల్ల ఈ చిత్రాన్ని తమిళ ప్రజలు ఆదరించారు.ఆ తర్వాత "భక్త ప్రహ్లాద" చిత్రాన్ని ప్రారంభించారు.ఈ చిత్రంలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయికి మొదట 500 రూపాయలు పారితోషికంగా నిర్ణయించారు. కాని ఆమె నటనను హర్షించి నిర్మాత వెయ్యినూటపదహార్లు బహూకరించి రైలు ఖర్చులు కూడా ఇచ్చారు. ఇందులో ప్రహ్లాదుని పాత్ర పోషించిన కృష్ణాజీ రావుకు 400 రూపాయలు పారితోషికం. ఈ తెలుగు టాకీ హీరో అప్పటి వయసు 9 సంవత్సరాలు. తరువాత ఈయన కిరాణా కొట్టు నడుపుకున్నాడు. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. 2001లో సినీ ఆర్టిస్టుల సంఘం ఈయనను సన్మానించి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు.

శ్రీవెంకట్ బులెమోని

No comments: