Monday, January 28, 2008

రాజశేఖర్ పై "చిరు ఫ్యాన్స్" దాడి :మెగాస్టార్ క్షమాపణ (Photos)

సినీ నటుడు రాజశేఖర్ పై మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈరోజు ఉదయం దాడి చేశారు. చిరంజీవికి రాజకీయానుభవం లేదని, చిరంజీవి పార్టీ పెడితే తాను అందులో చేరబోనని రాజశేఖర్ ఆదివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అన్నారు. దీనిపై చిరంజీవి అభిమానులు తీవ్రంగా ఆగ్రహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజశేఖర్ సోమవారం ఉదయం హైదరాబాదులోని నాంపల్లికి రైలులో వచ్చారు.రైలు నుంచి దిగగానే రాజశేఖర్ పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిన ప్రకటననే మళ్లీ మీడియా ప్రతినిధుల వద్ద చేశారు. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన రాజశేఖర్ కారును చిరంజీవి అభిమానులు కొన్ని కార్లలో వెంబడించారు. పంజగుట్ట వద్దకు రాగానే రాజశేఖర్ పై దాడి చేశారు. ఈ దాడిలో రాజశేఖర్ కూతురు శివాని గాయపడింది. రాజశేఖర్, జీవిత దంపతులతో పాటు పిల్లలు కూడా ఆ దాడి జరిగిన సమయంలో ఉన్నారు. దీంతో భీతిల్లిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కార్యాలయానికి వెళ్లారు. ఈ దాడికి సంబంధించి పోలీసు స్టేషనులో కేసులు నమోదయ్యాయి.
మెగాస్టార్ క్షమాపణ : హర్షించిన రాజశేఖర్
తన అభిమానుల దాడిలో గాయపడిన సినీనటుడు రాజశేఖర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మద్యాహ్నం క్షమాపణ చెప్పారు. అభిమానులు విధ్వంసక చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని మెగాస్టార్ పిలుపునిచ్చారు. చిరంజీవి క్షమాపణ పట్ల గాయపడిన రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దాడి చాలా భయంకరమైందిగా రాజశేఖర సతీమణి జీవిత పేర్కొన్నారు. రాజశేఖర్ నివాసానికి స్వయంగా వెళ్లిన మెగాస్టార్ ఆయన్ను ఆప్యాయంగా హత్తుకుని ఈ సందర్భంగా అభిమానులు సంయమనం పాటించాలని ఇద్దరు హీరోలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిదికాదని హితపుపలికారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్న చిరంజీవి రాజశేఖర్‌ తనపై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనప్పటికీ, తన అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. రాజశేఖర్ నా సోదరుడులాంటివాడని, తెలుగు చిత్ర పరిశ్రమ‌ కుటుంబంలో ఒక సభ్యుడని చిరంజీవి పేర్కొన్నారు.కాగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడుతో సహా, పలువురు రాజకీయ, సినీ నటులు రాజశేఖర్ కుటింబీకులను పరామర్షించారు.

No comments: