చిరంజీవి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. చిరంజీవి రాజకీయ ప్రవేశం దాదాపు ఖరారైన నేపధ్యంలో చిరంజీవి ఇలా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న విషయం ఖరారు కాబట్టే ఆయన తన రక్షణ కోసం, పార్టీ రక్షణ కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖులు, కొందరు రాజకీయ ప్రముఖులూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి రక్షణ కోసం 200 మంది ప్రైవేటు సైన్యం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని కోరుతున్న కాంగ్రెస్ ఎంపీ హరిరామ జోగయ్య నిన్న కూడా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అవినీతి మీద, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాల మీద ధ్వజమెత్తారు. సీనియర్ నాయకుడైన జోగయ్య చిరంజీవి వంటి నిష్కళంకుడు రాజకీయాల్లోకి రావాలని బహిరంగంగా ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన ఇలా వ్యవహరించడం నిజంగా సాహసమే. ఈసారి కాంగ్రెస్ టికెట్ ఆశించకపోవడం ఆయన ధైర్యానికి ఒక కారణం కావచ్చు.
చిరంజీవి ప్రైవేటు సైన్యాన్ని ఎందుకు పెట్టుకుంటున్నట్టు? ఆయనకు ప్రభుత్వం కల్పించే రక్షణ మీద నమ్మకం లేదా? చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా రాజశేఖరరెడ్డి వర్గీయులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కల్పించే పోలీసు రక్షణ మీద చిరు శ్రేయోభిలాషులకు నమ్మకం లేకుండా పోయిందని చెబుతున్నారు. అందువల్లనే మెరికల్లాంటి పాతికేళ్ళ లోపు యువకులకు శిక్షణ ఇచ్చి ఎంత ఖర్చయినా రక్షణగా పెట్టుకోవాలని చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, బావమరిది అల్లు అరవింద్ భావిస్తున్నారు. చిరంజీవి ఆగస్టులో తన పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నట్టు తాజా సమాచారం. ఆయన పార్టీ పేరు మీద, చిహ్నం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చిరంజీవి తన సినిమాల విషయంలో కూడా ఇదే విధమైన గోప్యతను పాటిస్తుంటారు. ప్రైవేటు ఆర్మీ ఇప్పటికే ఆయన చుట్టూ ఉంది. అయితే ప్రజల మధ్య తిరిగేటప్పుడు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా నివారించడానికి మరో 200 మంది ప్రైవేటు సైన్యానికి హైదరాబాద్ నగర శివారులో కఠోర శిక్షణ ఇస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలతో ప్రజల ముందుకు రానున్న చిరంజీవి విజయం సాధించాలని ఆశిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment