Thursday, May 22, 2008
ఇంత మౌనమేల చిరంజీవా?!
బోధిసత్వుడిలా మౌన ముద్ర దాల్చిన చిరంజీవి మౌనం ఇప్పట్లో వీడేనా? చిరంజీవి ఆత్మీయులైన అల్లు అరవింద్ సహా మరెవరికైనా చిరంజీవి మౌనం వెనకున్న రహస్యం తెలుసా? చిరంజీవికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం అసలుందా? సరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశ్యం చిరంజీవికి లేదనుకుందాం, మరి అతని కొత్త చిత్రం ప్రారంభించడానికి ఇంత కాలం వేచి ఉండటం ఎందుకు, తెలుగు గడ్డేమైనా రచయితలకు, దర్శకులకు గొడ్డు బోయిందా? రాష్ట్రం మొత్తం చిరంజీవో రామచంద్రా అంటుంటే చిరంజీవి మాత్రం మౌనముద్ర దాల్చడం వెనుక ఉద్దేశ్యం ప్రజలలో, పాలకులలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలలోకి చొచ్చుకురావాలనే తలంపా? లేక చిరంజీవి నమ్ముకున్న "ఆ నలుగురిదీ" రాజకీయ ప్రణాళిక చేయలేని అసమర్దతా? .....ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు చిరంజీవి అభిమానులను, ప్రత్యర్ధులను తొలిచి వేస్తున్నాయి. ఎంత తరచి తరచి చూసినా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదని అభిగ్న వర్గాల ఉవాచ. మరోవైపు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం వల్ల ఒక్కోసారి మంచికన్నా చెడే ఎక్కువ జరుగవచ్చనే భయాందోళనలూ అభిమానుల్లో చోటుచేసుకున్నాయి. "అంజి", "మృగరాజు", "యుద్ద భూమి" లాంటి చిత్రాలలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డ తర్వాత ఒక్కోసారి తుస్సుమనే అవకాశమూ లేకపోలేదనీ అభిమానులు భయపడుతున్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి ఈ మధ్యన చిరంజీవి బర్త్ డేరోజు పార్టీని ప్రకటిస్తారని ఒకవైపు, కాదు కొత్త సినిమా ప్రారంభిస్తారని మరోవైపూ ప్రచారం ఊపందుకుంది. మరి చివరికి ఎవరి మాట నెగ్గుతుంది. పోనీ కొత్త రాజకీయ ప్రధానమైన చిత్రం నిర్మించి ఆవెంటనే పార్టీని ప్రకటిస్తారనుకుంటే రాబోయే ఎలక్షన్లకు ఉన్న గడువు అతి కొద్ది కాలం మాత్రమే. ఆలోగా పురిటి బిడ్డలాంటి రాజకీయపార్టీతో పెద్ద పార్టీలను ఎదుర్కోగలడా? మరోవైపు చిరంజీవి బలం "యువత" అని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, మరి ఇతర వర్గాలను ఎలా ఆకట్టుకుంటారు. గతంలో ఎన్ టి రామారావు లా ప్రభంజనంలా రావాలని ఒకవేళ చిరంజీవి భావిస్తూండవచ్చు, కాని అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడంటే రామారావు గారి ప్రజాబలం తెలియక కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిరంగంగా రెచ్చగొట్టి అడ్రస్ లేకుండా పోయింది, గత అనుభవంతో ప్రస్తుతం కాంగ్రెస్ ఎక్కువశాతం చిరంజీవి విషయంలో మౌనంగా ఉండటానికే అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. మరి ఇలాంటి సమయంలో చిరంజీవి నిర్ణయం కమల్ హాసన్ "దశావతారం" చిత్రంలా వాయిదా పడుతూ వస్తూండటం (గతంలో చిరంజీవి నటించిన "అంజి" చిత్రం కూడా వాయిదాలపై, వాయిదాలు వేస్తూ వచ్చి చివరికి బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడిందన్న విశయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది) అంత మంచిదేనా? మరి చిరంజీవి తన మౌనాన్ని ఇప్పటికైనా వీడేనా లేక మాజీ ప్రధాని పి వి నరసిం హా రావు గారిలా మౌనాన్ని మరికొన్నాళ్ళు ఆశ్రయిస్తారా...!? చూద్దాం ఏం జరుగుతుందో.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment