Thursday, March 20, 2008

అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు


అందాల నటుడు శోభన్ బాబు ఇక లేరు. నటన భూషణ శోభన్ బాబు గురువారం ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. యోగా చేస్తుండగా ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. భక్త శబరి సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన శోభన్ బాబుకు అందాల నటుడిగా పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయనకు ఎనలేని అభిమానులున్నారు. ఇటీవల చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నటించిన చివరి సినిమా అడవి దొర. తెలుగు సినీ రంగంలో శోభన్ బాబుది ఒక ప్రత్యేక అద్యాయం. శోభన్ బాబు పూర్తి పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ప్రముఖ తెలుగు కథానాయకులలో ఒకరిగా వెలుగొందిన ఈయన 14 జనవరి, 1937 రోజున జన్మించారు. అందమైన రూపం, క్రమశిక్షణ తో కూడిన సినీ జీవితం శోభన్ బాబుది. 1959లో విడుదలైన "దైవబలం" సినిమాలో శోభన్‌బాబుకు ఒక చిన్నపాత్ర లభించింది.1960లో విడుదలైన "భక్త శబరి"లో మునికుమారునిగా శోభన్ బాబుకు పాత్ర మరికాస్త ముఖ్యమైన పాత్ర లభించింది. ఇంకా "సీతారామ కళ్యాణం"లో లక్ష్మణుడు, "భీష్మ"లో అర్జునుడు, "లవకుశ"లో శత్రుఘ్నుడు వంటి పాత్రలలో నటించారు. "పుణ్యవతి", "చదువుకున్న అమ్మాయిలు", "పూలరంగడు", "ఇద్దరమ్మాయిలు", "బుద్ధిమంతుడు" వంటి సినిమాలలో కూడా నటించారు."వీరాభిమన్యు" సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. మొదట ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన శోభన్ బాబు 1965 వచ్చిన "వీరాభిమన్యు"తో సోలో హీరోగా నిలదొక్కుకున్నారు. అప్పటి నుంచి 1997లో "మనుషులు మారాలి" సినిమా వరకు ఆయన వెనక్కి చూడలేదు. "గోరింటాకు", "మల్లెపువ్వు", "శారద", "బలిపీఠం", "ముందడుగు", "కార్తీక దీపం" వంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయనకు ఐదు సార్లు "నంది అవార్డులు" వచ్చాయి. నాలుగు సార్లు ఆయన "ఫిల్మ్ ఫేర్ అవార్డులు" అందుకున్నారు. తన సమకాలీన నటుడు కృష్ణతో కలిసి ఆయన మంచిమిత్రులు, "కురుక్షేత్రం" వంటి సినిమాల్లో నటించాడు. ఏ మాత్రం బేషజాలు లేని నటుడిగా శోభన్ బాబుకు పేరుంది.శోభన్ బాబు మొత్తం 220పైగా చిత్రాలలో నటించారు.

2 comments:

krishna rao jallipalli said...

నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతం hits సాదించింది ఒక్క శోభన్ బాబు మాత్రమె. అందరి మనసులలో చిరస్తాయిగా నిలిచి పోయే ఎన్నో పాత్రలు సాంఘికం, పౌరనికం, జానపదం, సవ్య సాచి శోభన్ అంటేనే ఆనందం, చూస్తేనే పరమానందం.

krishna rao jallipalli said...

very very shocking news. అందాల నటుడు శోభన్ baabu ఇక లేరు అంటే నమ్మబుద్దవడం లేదు. అన్ని t.v. channels వారు చాల చాల బాగా coverage ఇచ్చి వారి అభిమానాన్ని చాటుకోవడం హర్షణీయం. ఈ మద్యనే శోభన్ బాబు గారి గురించి చక్కటి ఆర్టికల్ చదవడం సంభవించింది ee bloglo.
- నిగర్వి, నిరడంబురుడు శోభన్ బాబు కి flops చాల తక్కువ.
- NTR, ANR రాజ్య మేలుతున్న కాలం లో కృష్ణ గారు శోభన్ గారు ఒకే సారి stardam అందుకున్నారు. స్వశక్తి తో తమ తమ స్థానాలని పదిల పరుచుకొన్నారు.
- ఆయన నటించిన చిత్రం 'మోస గాడు' విలన్ ఎవరో తెలుసా - మన చిరంజీవే.
- ఆయన మనసుని ఎవరైన నొప్పించారో ఏమో గాని - చాల కాలం నుండి ఆయన సినీ పరిశ్రమకి దూరంగా ఉన్నారు. ఎ సభలకి, సమావేశాలకి attend అవడం లేదు. ఎ functions కి కూడా హాజారు అయిన దాఖలాలు లేవు. ఆఖరకి ఈ మధ్య జరిగిన వజ్రోస్తావాలకి కూడా హాజారు అవలేదు. కారణాలు తెలియదు. వివాదలకి ఎప్పుడు దూరం గా ఉండే శ్రీ శోభన్ బాబు గారికివే నా నివాళులు.