Saturday, March 8, 2008

ఒక మంచి సినిమా "గమ్యం"


స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొనసాగుతూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న "గమ్యం" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఒకప్పుడు "ఐతే", "ఆనంద్" ల లాగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని పత్రికలు రివ్యూలను ప్రచురించాయి. శర్వానంద్ ముఖ్య భూమికతో, అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రతో సాగే ఈ చిత్రంలో కమిలినీ ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది.
మూస పాత్రలు, కొత్తదనం లోపించిన కథలతో విసుగు చెందిన తెలుగు ప్రేక్షకుడు కాస్త రిలాక్స్ కావాలంటే గమ్యం చిత్రం చూడొచ్చు. కథా విషయాని కొస్తే డబ్బులోనే పుట్టి పెరిగిన ఓ యువకుడు బయట ప్రపంచాన్ని చూస్తే అందులో అతనికి ఎదురైన సంఘటనలు ఎలా ఉంటాయో అన్న పాయింటుకు తెర రూపమే ఈ చిత్రం.
ప్లాస్ బ్యాక్‌లను పక్కన పెట్టి చెప్పాలంటే అభిరామ్ (శర్వానంద్) ఓ ధనవంతుని కుమారుడు. పదివేల కోట్లకు వారసుడైన ఇతను డబ్బే లోకంగా పెరుగుతాడు. ఓ సారి స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళమివ్యడానికి వెళ్లి అక్కడి సేవ చేస్తున్న వైద్య విద్యార్ధిని జానకి (కమిలిని ముఖర్జీ)పై మనసు పడతాడు.
అయితే ఆమెను వారంలోనే ప్రేమలో పడేస్తానని మిత్రునితో ఛాలెంజ్‌ చేసిన అభిరామ్ జానకిని పుట్టినరోజు పార్టీకి ఆహ్వానిస్తాడు. ఆ పార్టీలో అభిరామ్‌కు తన ప్రేమను చెప్పాలని వచ్చే జానకికి అభిరామ్ పందెం విషయం తెలిసి అతన్ని అసహ్యించుకుంటుంది. కానీ తాను నిజంగానే ప్రేమిస్తున్నానని అభిరామ్ చెప్పినా జానకి నమ్మదు.
దీంతో అభిరామ్ ఆమెను కారులో ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. వీరి గొడవ సమయంలో కారు అదుపుతప్పి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఆస్పత్రిలో కళ్లు తెరచిన అభిరామ్‌కు జానకి కన్పించదు. దీంతో ఆమెను వెతకడానికి బైక్ మీద బయలుదేరుతాడు అభిరామ్. ఈ సమయంలో అభిరామ్‌కు గాలి శ్రీను (అల్లరి నరేష్) పరిచయం అవుతాడు. అభిరామ్ తన పయనంలో అనేక మంది వ్యక్తుల్ని కలుస్తాడు. చివరకు నక్సలైట్లను సైతం కల్సుకుంటాడు. ఇలా అన్ని చోట్లా జానకి గురించి వెతికే అభిరామ్ చివరకు ఆమెను ఏవిదంగా కలుసుకున్నాడు, ఆ తర్వాతేం జరిందో తెలియజెప్పే చిత్రమే ఈ "గమ్యం". మొత్తంగా చూస్తే కథ బలహీనమైనా ప్రేక్షకునికి ఆ లోటు కన్పించకుండా కథనాన్ని ముందుకు నడిపిన తీరు బాగుంది. ఆర్టిస్టుగా శర్వానంద్ మంచి పరిణితి సాధించాడు. అల్లరి నరేష్ పాత్ర కూడా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. హీరోయిన్‌గా కమిలిని నటన ఆకట్టుకుంటుంది. చిత్రంలోని సంభాషణలు కొన్ని చోట్ల అద్భుతంగా వచ్చాయి. సినిమా మలిచిన దర్శకుని ప్రతిభను ప్రశంసించవచ్చు. ఈ చిత్రానికి సంగీతం సైతం చక్కగా కుదిరింది.

No comments: