Tuesday, April 1, 2008

కొత్త మలుపులు తిరుగుతున్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కేసు

వివాదాల్లో చిక్కుకున్న సుప్రసిద్ధ పాప్ స్టార్ బ్రీట్నీ స్పియర్స్ వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలను ఆమె తండ్రి జేమ్స్ స్పియర్‌కు కట్టబెడుతూ కోర్టు వెలువరించిన ఆదేశాన్ని సవాలు చేస్తూ అటార్నీ దఖలు చేసిన బిడ్‌ను కాలిఫోర్నియా కోర్టు తిరస్కరించింది. అయితే 26 ఏళ్ల పాప్ సింగర్ బ్రీట్నీ తరపున తన పోరాటాన్ని కొనసాగిస్తానని అటార్నీ జాన్ ఎర్డ్‌లీ శపథం చేశారు. రెండు ముఖ్యమైన అంశాలపై సంరక్షకత్వ ఆదేశాన్ని తాను సవాలు చేయనున్నట్లుగా జాన్ తెలిపారు. జిమ్మీ స్పియర్స్‌కు సంపూర్ణ సంరక్షకత్వ బాధ్యతను మంజూరు చేసిన అప్పీల్‌పై విచారణ జరపలేమని కాలిఫోర్నియా రెండో జిల్లా అప్పీల్స్ కోర్టుకు చెందిన త్రిసభ్య న్యాయాధికారుల మండలి ఆదివారం స్పష్టం చేసింది. కాలిఫోర్నియా చట్టం ప్రకారం అప్పీలు చేయబడిన ఆదేశాలపై తాత్కాలిక సంరక్షకత్వ ఉత్తర్వులను మంజూరు చేయడం ప్రత్యేకంగా మినహాయించబడటమే దీనికి కారణమని త్రిసభ్యమండలి పేర్కొంది. వ్యాపార విషయాలను చూసుకోవడంలో, తన సొంత కౌన్సిల్‌ను ఎంపిక చేసుకోవడంలో బ్రీట్నీ అసామర్థ్యతపై రెండు నిర్దిష్ట ఆదేశాలపై అప్పీలు చేయవచ్చనే ప్రాతిపదికన తాను పునర్విచారణకు పిటీషన్ దాఖలు చేయనున్నట్లుగా అటార్నీ ఎర్డ్‌లీ తెలిపారు. మార్చి 11న పాప్ సింగర్ బ్రీట్నీ స్పియర్ వ్యవహారాల బాధ్యతను ఆమె తండ్రి జిమ్మీ స్పియర్స్ మరియు లాయర్ ఆండ్ర్యూ వాలెట్‌లకు కట్టబెట్టిన సంరక్షకత్వపు ఆదేశంపై ఎర్డ్‌లీ సవాలు తన ప్రాథమిక సవాలును దాఖలు చేశారు. కాలిఫోర్నియా కోర్టు ఫిబ్రవరి మొదట్లో వాలెట్ మరియు స్పియర్స్‌లను సహ సంరక్షకులుగా నియమించింది. ఈ ఆదేశాన్ని ఇప్పుడు జూలై 31 వరకు అమల్లో ఉండేలా పొడిగించారు. మాజీ భర్త కెవిన్ ఫెడర్లిన్‌తో 2006 నవంబర్‌లో తెగతెంపులు చేసుకున్నప్పటినుంచి పాప్ సింగర్ బ్రీట్నీ స్పియర్ జీవితం ఆమె చేతుల్లో లేకుండా పోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె పునరావాస కేంద్రంలో ఉంటూ తన ఇద్దరు పుత్రులపై సంరక్షణాధికారాన్ని సైతం కోల్పోయింది. జనవరిలో ఆమెను రెండు లాస్ ఏంజెల్స్ ఆస్పత్రుల్లో చేర్పించారు. అక్కడ ఆమె మానసిక స్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలి వారాల్లో స్పియర్ స్థితి కాస్త మెరుగైనట్లుగా కనిపించింది.
కేసు పూర్వాపరాలు
2007 సంవత్సరం పొడవునా బ్రీట్నీ స్పియర్ సహచరుడిగా ఉన్న స్వయం ప్రకటిత మేనేజర్ శామ్ లుట్ఫీని ఆమెనుంచి దూరం కావలసిందిగా తాత్కాలిక ఆదేశం జారీ చేయబడింది. ఏప్రిల్ 16 దాకా ఈ ఆదేశం అమల్లో ఉంటుంది. కాగా, మరోవైపున ఎర్డర్లీ తనను టెలిఫోన్ సంభాషణ
ద్వారా బ్రీట్నీ స్పియర్ నియమించుకుందని కోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో ఈ సంరక్షకత్వ కేసును స్టేట్ కోర్టునుంచి ఫెడరల్ కోర్టుకు తరలించాలని ఎర్డర్లీ ప్రయత్నించారు. అయితే బ్రీట్నీ తరపున ఎర్డర్లీ ప్రాతినిథ్యం వహించలేడని ఫెడరల్ కోర్టు తోసిపుచ్చింది. తనను బ్రీట్నీ సంరక్షకుడిగా నియమించుకుందని ఎర్డర్లీ ప్రకటించిన సమయంలో తన తరపున లాయర్‌ను నియమించుకునే అధికారం చట్టపరంగా బ్రీట్నీకి లేదని కోర్టు తెలిపింది.
(కర్టెసీ: దట్స్ తెలుగు)

No comments: