Saturday, April 19, 2008

"భయపడుతున్న" చిరంజీవి..?!


రాజకీయ రంగ ప్రవేశం పట్ల చిరంజీవి భయపడుతున్నారా?. ఏమో, పరిస్థితులు చూస్తే చిరంజీవి భయపడుతున్నట్లుగానే అనిపిస్తోందని టాలీవుడ్ సమాచారం. తెలుగు సినీ రంగంలో చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చన్న వదంతులు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుత రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అనేక విధాలుగా చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయనను రాజకీయాల్లోకి రాకుండా చూస్తోందన్న అభిప్రాయం సినీ రంగ ప్రముఖుల్లో ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న విషయాన్ని అధికారులు వైఎస్ కు నివేదించారట. ఈ విశయమై రాజశేఖర రెడ్డి ఇంటలిజెన్స్ అధికారులకు సంపూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా రహస్య ఆదేశాలిచ్చారని టాలీవుడ్ లో వదంతులు వినిపిస్తున్నాయి. అదీగాక చిరంజీవి ఆస్తులకు సంబంధించిన గుప్త సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని మరో వదంతి సినీ పరిశ్రమలో వ్యాపించింది. కేంద్ర ఆర్ధిక శాఖకు చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల నుంచి ఈ సమాచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులు తెప్పించుకున్నట్టు పలువురు అనుకోవడం తెలుగు సినీ పరిశ్రమలో బహిరంగ రహస్యమే. అల్లు అరవింద్ సహా, పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, కొందరు మితృల వత్తిడికి తలొగ్గిన చిరంజీవి రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారే కానీ ఆయనకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని చెబుతున్నారు. చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బు పాడుచేసుకోవడం ఇష్టం లేదంటున్నారు. చిరంజీవి పార్టీపై మీడియాలో వార్తా కథనాలు బాగా తగ్గిపోయాయి. మరో నెలరోజుల్లో చిరంజీవి రాజకీయ పార్టీ విశయంలో ముందుకు రానట్టయితే ఆయన రాజకీయాల్లోకి శాశ్వతంగా రాకపోవచ్చన్ని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

No comments: