Monday, April 21, 2008

రాజకీయాల్లోకి రానున్న వేణు మాధవ్, జీవిత, జయసుధ


తెలుగు సినీ రంగానికి రాజకీయాలేం కొత్త కాదు.అయితే కొత్తగా మరికొందరు సినీ తారలు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తంవుతున్నారు. తాజాగా సినీ నటీమణులు జయసుధ, జీవిత, హాస్య నటుడు వేణు మాధవ్ లు రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ముగ్గురూ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి రానున్న ఎన్నికలలో పోటీకి దిగనున్నట్లు తాజా సమాచారం. కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి తెలుగు సినీ హాస్యనటుడు వేణుమాధవ్ ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలుగుదేశం పార్టీ సినీ గ్లామర్ ను కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ తో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వేణుమాధవ్ ను కమలాపూర్ నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వేణు మాధవ్ పోటీకి సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
కాగా, హైదరాబాదులోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి సినీ నటి జీవితను పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు కాంగ్రెసుకు అనుకూలంగా, మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. వారిపై చిరంజీవి అభిమానులు దాడి చేసిన తర్వాతి కాలం నుంచి వారు కాంగ్రెసుకు మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇదిలా ఉంటే, సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి మరో సినీ నటి జయసుధను పోటీకి దింపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనారిటీ వర్గాలైన క్రిస్టియన్లు అధికంగా నివసించే ఈ ప్రాంతంలో క్రిస్టియన్ మతంలోకి చేరిన జయసుధ తమకు బలంగా పరిణమిస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులుగా ముషిరాబాదు నుంచి నాయని నర్సింహారెడ్డి, సికింద్రాబాదు నుంచి పద్మారావు పోటీకి దిగనున్న విషయం తెలిసిందే.

No comments: