Friday, August 24, 2007

దసరాకు తెలుగు సినిమాలో రసవత్తర పోటీ: లక్ష్యం 150 కోట్లు.





తెలుగు సినీ పరిశ్రమలో దసరా సందడి ప్రారంభమైంది. ఈ దసరాకు విడుదలవుతున్న చిత్రాల వ్యాపార లక్ష్యం రమారమి నూటయాభై కోట్ల రూపాయలు. ఈ దసరా సీజన్ లో పెద్ద హీరోల చిత్రాలకు పోటీగా యువ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి.


కాగా అన్ని చిత్రాలూ ప్రతిష్టాత్మకమైనవే కావడం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా "పోకిరీ" లాంటి సంచలన విజయం సాధించిన చిత్ర కథానాయకుడు మహేష్ బాబు నుంచి వసున్న "అతిథి" చిత్రం ఒకవైపు పోటీలో ఉండగా, "పోకిరీ" చిత్రానికి దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్, చిరంజీవి తనయుడు రాం చరన్ తేజ హీరోగా వైజయంతి బ్యానరుపై నిర్మిస్తున్న "చిరుత" మరోవైపు పోటీలో ఉంది.
ఇక అక్కినేని నాగార్జున హీరోగా, "మాస్" దర్శకుడు లారెన్స్ రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న "డాన్"పై సినీ పరిశ్రమలో, ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విక్టరీ ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేశ్, బోయపాటి సీను దర్శకత్వంలో నటిస్తున్న "తులసి రెడ్డి"పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
మరోవైపు నందమూరి నటకిశోరం "ఒక్క మగాడు"తో సంచలనాలు సృస్టించడానికి తెర తీయబోతున్నట్లు కొన్ని వర్గాల కథనం. వెరసి ఈ దసరాకు తెలుగు నేలపై విడుదలవబోతున్న చిత్రాలన్నీ ప్రతిష్టాత్మకమైనవే. చిన్న సినిమాలను దృస్టిలో పెట్టూకోకున్నా ఈ చిత్రాల వ్యాపార అంచనాలు సుమారు 150 కోట్లు.
ఇక "అండర్ డాగ్"లా (దీనినే చాపకింద నీరులా అనికూడా అనుకోవచ్చు) శేఖర్ కమ్ముల "హ్యాప్పీ డేస్" చిత్రం ఈ అన్ని చిత్రాలకు మంచి పొటీ ఇవ్వడంకోసం సిద్దమవుతోంది. ఇంతక్రితం వచ్చిన శేఖర్ కమ్ముల చిత్రాలు "ఆనంద్", "గోదావరి" చిత్రాలు తెలుగునాట ఆర్థికంగా మంచి విజయాన్ని సాధించాయి.దాంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఏదేమయినా ఇప్పుడు రానున్న దసరా సీజన్ తెలుగు సినిమాలకు మంచి పోటీనిస్తుండగా, తెలుగు ప్రేక్షకునికి మంచి వినోదాన్ని అందివ్వనున్నాయి. సుమారు నెలన్నరలోగా విడుదలవనున్న ఈ అన్ని చిత్రాలలో ఏది ఖార్సయిన చిత్రమో, ఏది ఖాళీ చిత్రమో తేల్చడానికి తెలుగు ప్రేక్షకుడు సిద్దంగానే ఉన్నాడు. ఇక సినిమావారిదే ఆలశ్యం. ఈ దసరా వారికి సంతోశాన్నిచ్చే మధురమైన దసరా అవుతుందో లేక బాధతో మరువలేని దసరా అవుతుందో వేచి చూస్తేగానీ తెలీదు.
శ్రీవెంకట్ బులెమోని.

No comments: