Thursday, November 1, 2007

"హ్యాపీడేస్" టీచర్ కమలిని ముఖర్జీ ఇంటర్వ్యూ




"ఆనంద్"తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ భామ కమలిని ముఖర్జీ. ఆమె తొలి చిత్రం "ఫిర్‌మిలింగే" అనే బాలీవుడ్ చిత్రం. ముంబైలో మోడలింగ్ చేస్తున్న ఆమెకు మంచి కాఫీలాంటి కథను చెప్పి శేఖర్ కమ్ముల ఒప్పించారు. ఆ చిత్రంలో పాత్రకు జీవం పోసిన కమలిని నంది పురస్కారాన్ని కూడా సాధించింది.ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చినా "మీనాక్షి"లో రాజీవ్ కనకాల సరసన నటించినా ఆ చిత్రం నిరాశపరిచింది. ఆ తర్వాత "స్టైల్"లో ప్రభుదేవా చెల్లెలు పాత్రలో నటించింది.ఆ తర్వాత "గోదావరి","రాఘవన్","పెళ్ళయింది కానీ" వంటి చిత్రాలు చేసింది. తాజాగా పవన్‌కళ్యాణ్ సరసన "జల్సా"లో నటిస్తోంది. ఆమెతో కాసేపు జరిగిన ఒక చిన్న ఇంటర్వ్యూ విశేషాలు.
ప్రశ్న: సినిమారంగాన్నే ఎంచుకోవడానికి కారణం?
జ: చాలా కష్టం.చిన్నప్పటి నుంచీ నటించాలన్న కోరిక ఉండేది. కొల్‌కతఅలో ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీకి ముంబై వెళ్ళాను. అక్కడ యాడ్‌ ఫిలింలో నటించాను. అది చూసి శేఖర్ కమ్ముల నాకు ఆనంద్‌లో అవకాశం కల్పించారు. ప్రశ్న: ఆయన ప్రతీ చిత్రంలో చేస్తున్నారు. కారణం?
జ: నేనెవరని అందరికీ తెలియజేసిన వ్యక్తి. ఆయన నాకు మంచే చేస్తారని నమ్మేదాన్ని. అందుకే చిన్న పాత్రయినా "హ్యాపీడేస్"లో చేశాను. టీచర్‌కు, స్టూడెంట్‌కు ఎలాంటి సంబంధాలుండాలో నా పాత్ర ద్వారా తెలియజెప్పారు.
ప్రశ్న: ఇప్పటి హీరోయిన్ల పోటీని ఎదుర్కొవడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారా?
జ: ఇక్కడ పోటీ అనేది లేదని నా అభిప్రాయం. ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించినా చాలా సరదాగా చేస్తుంటాం. ఒకరికి మరొకరికి పోటీ అనేది రాదు. ఎంతోమంది వస్తుంటారు. నా తర్వాత కూడా చాలామంది వచ్చారు. ఎవరి శైలి వారిది. "ఆనంద్"లో చిర్రుబుర్రులాడే పాత్రను బాగా పోషించానని అటువంటి పాత్రలే తర్వాత వస్తాయని మొదట్లో చాలామంది అన్నారు. కానీ రకరకాల పాత్రలు ఆ తర్వాత పోషించాను. ప్రతి సినిమాకు ఏదో కొంత నేర్చుకుంటూనే ఉంటున్నాను. షూటింగ్ ఉన్నాలేకున్నా క్రమం తప్పకుండా యోగా మాత్రం చేస్తాను. ఇక డాన్స్ మామూలుగా ప్రాక్టీస్‌ చేస్తాను.
ప్రశ్న: ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా ద్వితీయ విఘ్నమని భయపడుతుంటారు. మీ విషయంలో మీనాక్షి అలా అనిపించిందా?
జ: అలా అనిపించలేదు. నాకు పూర్తిగానచ్చాకే పాత్రను అంగీకరిస్తాను. కానీ రెండవ సినిమా చేసేటప్పుడు చాలామంది మీరన్నట్లు చెప్పారు. కానీ నాకలాంటి సెంటిమెంట్లు లేవని సమాధానమిచ్చాను. అయినా సినిమా అపజయం పట్ల కాస్త బాధ వేసింది.
ప్రశ్న: ఇప్పుడు "పెళ్ళయింది కానీ" సినిమా కూడా అదేకోవలోకి వస్తుందంటున్నారు?
జ: కథ చాలా బాగుంది. తండ్రిని రక్షించుకునేందుకు తన ప్రేమను త్యాగం చేసిన యువతి పాత్ర. థియేటర్లలో రెస్పాన్స్ బాగుంది. ఈ పాత్రను చూసి పాత సినిమ కథ అన్నారు. కానీ ఆ సినిమాలు నేను చూడలేదు.
ప్రశ్న: ఆ తర్వాతైనా ప్రాధాన్యత గల పాత్రలకు ముఖ్యత్వం ఇచ్చారా?
జ: నాకు పాత్ర పూర్తిగా నచ్చితేకానీ ఒప్పుకోను. "ఆనంద్" నుంచి "పెళ్ళయింది కానీ" వరకు అన్నీ అలాంటివే. రేపు రాబోయే "జల్సా"లో కూడా పాత్ర నచ్చే చేస్తున్నాను.
ప్రశ్న: ఎటువంటి పాత్ర?
జ: అది ఇప్పుడే చెప్పలేను.
ప్రశ్న: బాలీవుడ్‌లో ఎప్పుడు కన్పిస్తారు?
జ: ఓ చిత్రం చేస్తున్నాను. త్వరలో ఆ వివరాలు చెబుతాను.

No comments: