Thursday, November 1, 2007

బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ : "సూపర్ హిట్" దిశగా "హ్యాపీడేస్"

1. ప్రతిరోజూ బ్లాకులోనే "హ్యాపీడేస్" టికెట్లు శేఖర్ కమ్ముల చిత్రం "హ్యాపీడేస్" సూపర్ హిట్ వైపు శరవేగంగా పరుగులు తీస్తోంది. పెద్ద హీరోల చిత్రాలు, యువ హీరోల చిత్రాలు ఎన్ని పోటీకి వచ్చినా తానే రాజునని నిగ్గదీసుకుని మరీనిలుచున్న "హ్యాపీడేస్" చిత్రం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టోన్ చిత్రం గా మారింది. కలెక్షన్లలో రికార్డులు సృస్టిస్తూనే, చూసిన ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్లకు రప్పించుకుంటున్న ఘనతను ఈ చిత్రం సాధించింది.
2. మరో "పోకిరి" ఈ "అతిధి"
మరో "పోకిరి" గా టాలీవుడ్ లో టాక్ వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృస్టించకున్నా ప్రస్తుతానికి నిలకడగా కొనసాగుతూ విజయం వైపు పయనిస్తోంది. ఎక్కువ శాతం మాస్ ను దృష్టిలో ఉంచుకుని చేసిన చిత్రంగా సినీ ప్రేక్షకులు విమర్శిస్తున్న ఈ చిత్రానికి యువతే పెద్ద దిక్కుగా మారింది.
3. పరిమళించని "తులసి"
ఒక వైపు "హ్యాపీడేస్" విజయపరంపర, మరో వైపు యువతను అలరిస్తున్న "అతిధి" మధ్యన రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది "తులసి" పరిస్థితి. విక్టరీ వెంకటేశ్ కు పెట్టని కోటలా వుండే మహిళా ప్రేక్షకులను దూరం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్లు బాగా తగ్గుముఖం పట్టాయి. ఉన్నవాటిలో ముచ్చటగా మూడోది తరహాలో ఈ చిత్రం మూడవ స్థానాన్ని ఆక్రమించింది.
4. చిన్న చిత్రాలకు కూడా పోటీనివ్వలేకపోతున్న "చిరుత"
చరన్ తేజ్ నటించిన "చిరుత" పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రారంభంలో విరుచుకుపడి మొదటివారపు కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ప్రస్తుతం ఒక మోస్తరు చిత్రాలకు కూడా పోటీని ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. 100రోజులకోసం తప్పితే ఈ చిత్రాన్ని కొనసాగించడం వృధా అని టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల కథనం.
5. ఒకే ఒక్క కుటుంబ కథా చిత్రం "చందమామ"

ప్రస్తుతం ప్రదర్శింపబడుతున్న చిత్రాలలో ఉన్న ఏకైక కుటుంబ కథా చిత్రంగా గుర్తింపు పొందిన "చందమామ" క్లాస్ ప్రేక్షకులను, కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులకు మొదటి ఛాయ్స్ గా కొనసాగుతోంది. కలెక్షన్ల పరంగా ఈ చిత్ర కలెక్షన్లు బాగా తగ్గినప్పటికీ, ఫరవాలేదనేలా ముందుకుసాగుతోంది.

శ్రీవెంకట్ బులెమోని

No comments: