తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ గ్లామర్ పవర్ ఇప్పుడు లండన్ ను తాకింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వాక్స్ స్టాచ్యూను ఏర్పాటు చేయనున్నారు. రజనీకాంత్ అభిమానుల నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికి 12000 పిటిషన్లు తమకు అందాయని వారు అన్నారు. రజనీకాంత్ ఫ్యాన్స్ ఇందుకోసం పెద్దయెత్తున ప్రచారాన్ని మొదలుపెట్టి అందులో విజయం సాధించారు. ఇందుకోసం వారు www.petitiononline.comకు తమ పిటిషన్లను పోస్ట్ చేశారు. శివాజీ సినిమా చేసిన బిజినెస్ వివరాలు తెలుపుతూ విగ్రహ ఏర్పాటుకు రజనీకాంత్ కచ్చితంగా అర్హుడనే విషయాన్ని వారు ఈ పిటిషన్ లో వివరించారు. రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిఉన్న విషయాన్ని వారు ఇందులో తెలియజేశారు. ఈ పిటిషన్ లో 11453 మంది సంతకాలు చేశారు. పిటిషన్ లో అభిమానులు వాదించిన తీరు...భారతదేశంలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు, భారత్ లో అగ్ర నటుడు, దక్షిణ భారతంలోని 100 మిలియన్ల జనాభా ఆరాధ్యుడు రజనీ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేస్తాయి. "శివాజీ" సినిమా బ్రిటన్ లో టాప్ 10లో నిలిచింది, అమెరికాలోనూ తన సత్తాను చూపింది, మలేసియా, సింగపూర్, మిడిల్ ఈస్ట్, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, జపాన్, చైనాలలో రజనీ అభిమానులు ఉన్నారు. రజనీని విపరీతంగా అభిమానించే శ్రీలంక తమిళులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. బ్రిటన్ లో 150,000, ఫ్రాన్స్ లో 60,000 మంది ఉన్నారు. జపాన్లో రజనీ హవా అంతా ఇంతా కాదు. ప్రధాని మన్మోహన్ సింగే స్వయంగా జపాన్ పార్లమెంట్ లో రజనీకాంత్ ప్రభావం గూర్చి చెప్పాడు.ఈ కారణాలు సబబుగానే అనిపించాయి కాబట్టే రజనీ నిగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు తెలిపారు.విశేషమేమంటే రజనీకాంత్ వ్యవహారం సక్సెస్ కావడంతో కమల్ హాసన్ అభిమానులు కూడా మేడమ్ టుస్సాడ్స్ కు పిటిషన్ పంపారు. ఇప్పటికి 900మంది ఫ్యాన్స్ సంతకాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment