Tuesday, October 23, 2007

పగిలిన గుండెలు...పేలని తూటాలు- చెమర్చిన "చిరు" పితృ హృదయం


ఇలాంటి సంఘటన మరే ఇంటా జరగకూడదని ఆ దేవుడ్ని మరీ మరీ కొరుకుంటున్న పగిలిన హృదయాలు వారివి. పరిస్థితులప్రభావం వల్ల గుంభణంగా వుండే ఆ హృదయాల వెనుక ఉన్న అనంతమైన ఆప్యా,యానురాగాలను చూసి తెలుగు సినీ పరిశ్రమ కళ్ళు చెమర్చాయి. ప్రతి నిత్యం నిండుగా కళకళ లాడుతూ వుండే ఆ లోగిళ్ళు ఇప్పుడు విశాదచ్చాయలతో మౌనంగా రోదిస్తున్నాయి. ఇంటి ముందు రంగరంగ వైభవంగా జరగాల్సిన చిన్న కూతురు పెళ్ళి ఇల్లుదాటి ఢిల్లీ పురవీదులు చేరడంతో చిరంజీవి కుటుంబం పడుతున్న మానసిక నరకయాతన చెప్పడానికి మాటలు చాలవు, ఈ అక్షరాలకు చేతకాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారివి పగిలిన హృదయాలు.. పేలని తూటాలు.
చిన్న కూతురంటే ఇష్టం.. ఆ చిన్న కూతురు కలిగించిన కష్టం
చిరు చిన్న కూతురు వివాహం వారి ఇష్ట ప్రకారమే జరిగినా, ఈ రోజో రేపో వారు తప్పకుండా తిరిగి ఇంటికి వస్తారని ఆశిస్తూ, అందుకు సానుకూలంగా వుండాలని అందరూ భావించి, చిన్న కూతురుకు కష్టం కలిగించకూడదని చిరు తన వారందరికీ చెప్పిన కొంతసేపటికే, ఆ చిన్న కూతురు ఢిల్లీ చేరి, తన తల్లిదండ్రులనుంచి, వారి అభిమానులనుంచి తనకు, తన భర్త శిరీష్ భరద్వాజ్ కు రక్షణ కలిగించాలని ఢిల్లీ హైకోర్టుకు ఎక్కడంతో చిరంజీవి కుటుంబం యావత్తూ మరో శరాఘాతం తగిలినట్లు విలవిలలాడింది. తామందరూ ఎంతో ప్రేమగా చూసుకునే ఈ చిన్ని కూతురు తనంత తానుగా స్పందిస్తున్న మాటలా, లేక వెనక ఎవరైనా వుండి నడిపిస్తున్న సంఘటణలా ఎటూ తేల్చుకోలేకుండా వున్నారు. కన్న తల్లి రోదన ఒకవైపు, కన్న తండ్రి మనో వేదన మరోవైపు, ముక్కలైన బాబాయ్ హృదయం ఇంకోవైపు, మాటలకందని నరకయాతనలో మునిగిన ఆప్తులు, ఆత్మీయులు అందరూ ఏకమై అనుభవిస్తున్న మానసిక ఆవేదనతో మూగబోయిన ఆ పరిసరాలు తెలుగు సినీ జగత్తులోని మెగాస్టార్ ఇంట్లోనంటే ఎవరికీ నమ్మబుద్ది కాదు.
జనసంద్రమైన "చిరు"లోగిలి...
చిరంజీవి నివాసం వచ్చేపోయే ఆత్మీయులు, బంధువులు, అభిమానులతో జనసంద్రమైపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలలో వుండే మితృలు, బంధువులు, స్నేహితులు, అభిమానుల రాకతో జూబిలీ హిల్స్ ప్రాంతాలు జనంతో నిండిపోతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రతి నటుడూ, ప్రతి కళాకారుడూ, నిర్మాతా, టెక్నీషియన్ అనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ చిరంజీవిని కలిసివస్తున్నవారే. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు మొదలుకుని,పలువురు రాజకీయ నాయకులు చిరంజీవి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా వస్తూనే వుంటారు.
రిసెప్షన్ తో ముగింపు పలకాలని అందరి ఆరాటం
శ్రీజ పెళ్ళి ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ చర్చలకు, మానసిక ఆవేదనలకు అతి త్వరలో శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ల పెళ్ళి రిసెప్షన్ ఏర్పాటు చేసి ముగింపు పలకాలని కుటుంబ సభ్యులతోబాటు, బంధువులు, స్నేహితులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఆ పరంగా శ్రీజ మేన మామ అల్లు అరవింద్ ఈ పాటికే చర్యలు కూడా చేపట్టారు. వచ్చే సోమవారం ఢిల్లీ కోర్టు అడిగిన హామీ పత్రాలను సమర్పించి, వెంటనే శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లను హైదరాబాదుకు తీసుకు వచ్చి "రిసెప్షన్" ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయమని చిరంజీవి కూడా తన సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది.
శ్రీవెంకట్ బులెమోని

No comments: