Saturday, September 29, 2007

స్వర్గీయ ఎన్.టి.ఆర్ ను ఎండలో నిలబెట్టిన హీరో




స్వర్గీయ ఎన్.టి.ఆర్ తెలుగు వారి ఆరాధ్య నటునిగా ప్రజలచేత నీరాజనాలు అందుకున్నారు. సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు అగ్ర హీరోగా ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. అయితే అలాంటి ఎన్.టి.ఆర్ ను సహితం ఎండలో నిలబెట్టిన హీరో అలనాటి మేటి హీరో సి.హెచ్.నారాయణ రావు.


ఎన్.టి.ఆర్ సినీపరిశ్రమలోకి వచ్చేముందు కొన్ని రోజుల క్రితం అప్పటి నంబర్ వన్ హీరో సి.హెచ్.నారాయణ రావును ఒకసారి చూద్దామని ఆయన షూటింగ్ జరుగుతున్న వాహిని స్టూడియోకు వెళ్ళాడు. లోపల మేకప్ రూంలో మేకప్ చేసుకుంటున్న సి.హెచ్.నారాయణ రావును తాను కలవాలనుకుంటున్నటు గేట్ దగ్గరున్న వాచ్ మెన్ కు చెప్పి పంపించాడు ఎన్ టి ఆర్. అది విన్న నారాయణ రావు "తను, ఎందుకు వచ్చాడో తెలుసుకొమ్మని" తిరిగి వాచ్ మెన్ కు పురమాయించాడు. అప్పుడు "తాను, సినిమాలలో నటించడానికి మద్రాసు వచ్చాననీ, నారాయణ రావు సినిమాలను చాలాసార్లు చూసాననీ, ఆయనపై ఉన్న గౌరవంతో ఒకసారి చూడడానికి వచ్చాననీ" చెప్పాడు. అది విన్న నారాయణ రావు నాకిప్పుడు పని ఉంది, నన్ను చూడాలనుకుంటే ఓ రెండు, మూడు గంటలు బయటే వేచిఉండాల్సి వస్తుందని వాచ్ మెన్ తో చెప్పి పంపించాడు. అది విన్న ఎన్ టి ఆర్ కాసేపు ఆలోచించి నారాయణ రావు బయటికి వచ్చేదాకా ఎండలోనే వేచి యున్నాడు. రెండు, మూడు గంటలనుకుంటే అది కాస్తా ఐదు గంటలైన తర్వాత బయటికి వచ్చిన నారాయణ రావు ఎన్ టి ఆర్ ను పలకరించి, సినీ పరిశ్రమలో ఇదంతా మామూలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే నారాయణ రావు వెనకబడడం, ఎన్ టి ఆర్ నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత నారాయణ రావుకు వేషాలే కరువయ్యే పరిస్తితి వచ్చింది. అటువంటప్పుడు ఎన్ టి ఆర్ తనకు తెలిసిన నిర్మాతల చిత్రాలలో ఆయనకు వేశాలు ఇప్పించేవాడని, ఆ తర్వాత ఒకసారి తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో నారాయణ రావే స్వయంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సినీ పరిశ్రమలో చాలామంది తనను ఎన్ టి ఆర్ ను ఎండలో నిలబెట్టిన హీరో అని అంటుండేవారని, అది తెలిసిన ఎన్ టి ఆర్, నారాయణ రావుతో "ఇవన్నీ సినీ పరిశ్రమలో సాధారణం, పట్టించుకోకండి..." అన్నారనీ మరోమారు నారాయణ రావే గుర్తుచేసుకున్నారు.

No comments: