Friday, September 21, 2007

"శివాజి" చిత్ర కథపై రజినీ కాంత్ కు కోర్టు నోటీసు


తన కథను కాపీచేసి "శివాజి" చిత్రాన్ని నిర్మించారని, తనను మోసం చేసారని చెన్నైకి చెందిన ఒక న్యాయవాది చెన్నై సిటి సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దానిని విచారణకు తీసుకున్న న్యాయమూర్తి ఈ విషయమై వివరణ కోరుతూ చిత్ర నిర్మాత ఎం.వి.శరవణన్, చిత్ర దర్శకుడు శంకర్, చిత్ర కథానాయకుడు రజినీ కాంత్ లకు కోర్టు నోటీసులు పంపించారు. గత నెలలో విడుదలైన "శివాజి" చిత్రం కథ తనదని చెన్నైలోని చ్చేత్ పేట్ కు చెందిన న్యాయవాది ఎ.ఇళంగోవన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అతను తన పిటిషన్లో "నేను, "శివాజి" చిత్ర కథను 2005వ సంవత్సరంలో రాసానని, మూడు పేజీలలో రాసిన ఈ కథను, తను నిర్మాత ఎం.వి.శరవణన్, దర్శకుడు శంకర్, హీరో రజినీ కాంత్ లకు 12.10.2005న రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాను. అయితే దర్శకుడు శంకర్ కు పంపించిన కవర్ తిరిగివచ్చింది. అయితే అందులో తను వుంచిన కథ లేకుండా, కేవలం తెల్ల కాగితాలు మాత్రం ఉన్నాయి. అప్పట్లో పెద్దగా పట్టించుకోని నేను, చిత్రం విడుదల తర్వాత చూస్తే అది తాను వ్రాసిన కథనే చిన్న చిన్న మార్పులతో నిర్మించడం గమనించాను. ఇది నాకు దిగ్బ్రాంతిని కలుగజేసింది.తదనంతరం దీనిగురించి వివరణ కోరడానికి శంకర్ ను, రజినీకాంత్ లను కలవడానికి ప్రయత్నించగా, అది సాద్యంకాలేదు. దాంతో తాను కోర్టును ఆశ్రయించానని, ఆ కథను తనదిగా ప్రకటించాలని, అంతదాకా చిత్రాన్ని నిషేధించాలని" ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకున్న న్యాయమూర్తి, నిర్మాత, దర్శకుడు, హీరోలకు నోటీసులు ఇచ్చి, కేసును ఈ నెల 21కి వాయిదా వేశారు.

No comments: