Thursday, October 4, 2007

డైలాగుల క్యాసెట్లు మళ్ళీ వస్తున్నాయోచ్చ్..!!



"మారోజుల్లోనైతే, సినిమాల డైలాగులు బట్టీ పట్టేవాళ్ళం, ఇప్పటి సినిమాల్లో డైలాగులు, పాటలు కొంచెం కూడా అర్థం కావడంలేదు. అయినా మా రోజుల్లో సినిమాల పాటల గ్రాంఫోన్ రికార్డులు, సినిమా డైలాగుల గ్రాంఫోన్ రికార్డులు ప్రత్యేకంగా వచ్చేవి. ఇప్పుడు, డైలాగుల క్యాసెట్లంటేనే, చాలామందికి తెలీదు, ఇక పాటల క్యాసెట్లు వస్తాయి, అందులోని రాకు-షేకు గొడవల మధ్య ఒక్క చరణమూ, ఒక్క పల్లవీ అర్థమై చావదు అవి అసలు మా బుర్రకు ఎక్కవ్"

అనే వారిని చూస్తే పాత చింతకాయి పచ్చడి కబుర్లు చెప్పేవారిగా చాలామందికి తోస్తుంది. అయితే ఆ పాత చింతకాయ పచ్చడికి ధీటుగా ఇప్పుడు కొత్త చింతకాయ పచ్చడి రాబోతోంది. నిజమండీబాబూ, అలనాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించినవి అప్పటి పాటలు మాత్రమే కాదు, మాటలు కూడా. అలాగే ఇప్పుడు డైలాగుల క్యాసెట్లు రాబోతున్నాయి. లేటెస్ట్ సినిమాల డైలాగులు అభిమానులను ఎప్పుడూ ఉర్రూతలూగిస్తూనే వుంటాయి. అయితే టేప్ రికార్డర్ కొత్తగా వచ్చిన రోజుల్లో అభిమానులను అలరించిన మాటల క్యాసెట్లు, తదనంతరం టీవీల రాకతో మూలన పడ్డాయి. ఇప్పుడు డైలాగుల క్యాసెట్లను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. సుమారు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఆడియో మార్కెట్లోకి అడుగుబెట్టబోతున్న తొలి చిత్రం ఏమిటో తెలుసా...అదేనండీ యంగ్ ఎన్ టి ఆర్ యముడిగా నటించాడు చూడండి అదన్నమాట. 400ల సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో నిర్వహించే ఈ చిత్ర యాభైరోజుల ఉత్సవంలోనే ఈ చిత్ర "డైలాగుల" క్యాసెట్ ను మార్కెట్లోకి విడుదలచేయనున్నారు. ఇప్పుడు "యమదొంగ" తో మొదలయ్యే మాటల క్యాసెట్ల ప్రభంజనం అతి త్వరలోనే అందరు హీరోల చిత్రాలకు ప్రాకి, తెలుగువారి లోగిళ్ళలో పాటలు, మాటలు కలిసి వినిపిస్తాయన్నమాట. సో... కొత్త మార్పుకు స్వాగతం చెప్పడంకోసం ఇప్పటినుంచే సిద్దమవుదామా...!

No comments: