Monday, October 1, 2007

"అతిధి" కి 75 లక్షలు,"తులసి" కి 45 లక్షలు




మహేశ్ బాబు నటించిన "అతిధి" చిత్రం ఆడియో హక్కులను సుప్రీం ఆడియోస్ కంపనీ 75 లక్షలు వెచ్చించి స్వంతం చేసుకుంది. విక్టరీ వెంకటేశ్ నటించిన "తులసి" చిత్రానికి 45 లక్షలు చెల్లించి ఆదిత్య మ్యూజిక్ ఇండియా లిమిటెడ్ దాని ఆడియో హక్కులను స్వంతం చేసుకుంది. మహేశ్ బాబు చిత్రానికి ఒకవిధంగా మంచి రేటు వచ్చినా, వెంకటేశ్ చిత్రానికి సరైన రేటు రాలేదని టాలీవుడ్ అంటోంది. దానికి ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న పైరసీనే ప్రధాన కారణమని ఆడియో కంపనీలు అంటున్నాయి.గతంతో పోలిస్తే తెలుగు చిత్రాల ఆడియో మార్కెట్ కొంత కొత్తగా, మరి కొంత స్తబ్దుగా కొనసాగుతోంది. చిత్రాలు మంచి విజయం సాధించినా పైరసీవల్ల తాము హక్కులకోసం వెచ్చించిన మొత్తాలను రాబట్టుకోవడానికే ఇబ్బందులు పడాల్సి వస్తోందని, దాంతో ఒక విధంగా ఆడియో హక్కులకు చెల్లించే మొత్తాలు కొంత తగ్గినట్లే చెప్పవచ్చునని ఆడియో కంపనీలు అంటున్నాయి. దాంతో కొందరు నిర్మాతలు తామే స్వంత ఆడియో కంపనీలను స్థాపించి వారి చిత్రాల ఆడియోలను వారే విడుదల చేసుకుంటున్నారు. వై.వి,యస్ చౌదరి స్వంతంగా "యుక్త" ఆడియోస్ ను స్తాపించగా, కీరవాణి "వేల్" మ్యూజిక్స్ ని స్థాపించి ఇటీవలి "యమదొంగ" చిత్రాన్ని విడుదల చేసాడు. ఆడియో కంపనీలు సరైన రేటును తమ చిత్రాలకు ఇవ్వక పోవడం వల్లే తాము స్వంత ఆడియో కంపనీలను స్థాపించి తమ చిత్రాలను తామే విడుదల చేసుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. ఒక విధంగా ఇలాంటి పరిస్తితులు తెలుగు ఆడియో రంగానికి గడ్డు పరిస్తితిగానే చెప్పవచ్చునని సీనియర్ దర్శక, నిర్మాతలు అంటున్నారు.

No comments: